Connect with us

Education

మన బడి ఎందాక వచ్చింది?

Published

on

Spread the love

అమరావతి  : విద్యా రంగంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన బడి – నాడు నేడు పనులు ఎంత వరకు పూర్తయ్యాయో అనే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి   ఆదిమూలపు సురేష్ సమీక్ష చేశారు.  ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ  ఈ నెలాఖరులోగా ‘నాడు – నేడు ’ పనులు వంద శాతం పూర్తి కావాలని ఆదేశించారు.  నిర్ధిష్ట గడువులోగా  పనులు పూర్తి చేయడానికి రోజువారీ సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

సచివాలయంలోని తన కార్యాలయంలో మన బడి – నాడు నేడు పనులపై మంగళవారం మున్సిపల్, హౌసింగ్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షా అభియాన్ శాఖల ఉన్నతాధికారులతో   సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నాడు నేడు పనుల ప్రగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఫ్యాన్లు, స్మార్ట్  టీవీలు, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, పెయింటింగ్, అల్మరాల ఏర్పాటుతో పాటు తాగునీటి కల్పన, పారిశుద్ధ్య పనుల నిర్వహణా పనుల వివరాలను శాఖల వారీగా ఆరా తీశారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ చేపట్టని విధంగా విద్యా రంగంలో మౌలిక సదుపాయల కల్పనకు  ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సాగించాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు.

 ఈ నెల 19వ తేదీ వరకూ రాబోయే మూడ్రోజుల్లో ఏయే శాఖ ఎంత మేర పనులు పూర్తి చేయాలో చెబుతూ మంత్రి టార్గెట్లు నిర్ధేశించారు. ఇలా ప్రతి మూడు రోజులకు టార్గెట్లు పెట్టుకోవడం ద్వారా ఈ నెలాఖరులోగా వంద శాతం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

అలసత్వం వహిస్తే కఠిన చర్యలు : మంత్రి సురేష్

ఆదిమూలపు సురేష్

పనుల్లో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని సురేష్ హెచ్చరించారు. కొందరు ఇంజనీరు అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.  మార్చి నెలాఖరులోగా మొదటి విడత పనులు పూర్తి చేయాల్సిందేనని, ఏప్రిల్ నుంచి రెండో విడత పనులు చేపడతామని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్, హౌసింగ్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షా అభియాన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.