Connect with us

Elections

పరిషత్ ఎన్నికలు 6 రోజుల్లో పూర్తి !

Published

on

Spread the love

అమరావతి : అమరావతి: గతంలో సగంలోనే నిలిపి వేసిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు న్యాయపరమైన అవాంతరాలతో పాటు అన్ని అడ్డంకులు తీరిన నేపథ్యంలో తక్షణం ఎస్‌ఇసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సచివాలయంలోని పబ్లిసిటి సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా హైకోర్ట్ సైతం పరిషత్ ఎన్నికల వ్యాజ్యంపై తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించాలని అన్నారు.

తిరుపతిలోనూ గెలుస్తాం …

తిరుపతి పార్లమెంట్‌ స్థానంకు ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరుగనున్న నేపథ్యంలో వైయస్‌ఆర్‌సిపి అత్యధిక మెజార్టీతో ఈ స్థానంలో విజయం సాధిస్తుందన్నారు.  పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి సాధించిన మెజార్టీలను పరిగణలోకి తీసుకుంటే తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు 3 లక్షలకు పైగా మెజార్టీని సాధిస్తామని విశ్వాసం వుందన్నారు. జగన్ పట్ల ప్రజల్లో వున్న విశ్వసనీతకు స్థానిక సంస్థల ఎన్నికలు అద్దం పట్టాయి.

హైకోర్ట్ తీర్పును దృష్టిలో పెట్టుకుని, నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే ఆరు రోజుల్లో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు పూర్తవుతాయన్నారు. ఎన్నికల కమిషనర్ తక్షణం ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆయన కోరారు.

దేశమంతా కోవిడ్ వాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోందనీ,  రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియకు కొంత ఆటంకం ఏర్పడిందని మంత్రి తెలిపారు.  ఎస్‌ఇసి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే మండల, జిల్లాపరిషత్ ఎన్నికలను కూడా పూర్తి చేస్తే, ఆ తరువాత ప్రభుత్వం పూర్తిస్థాయిలో వాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి సారించేందుకు వీలు పడుతుందని రామచంద్రా రెడ్డి అన్నారు.

పదవులు పెంచుతాం..అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం : రామచంద్రా రెడ్డి

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్‌లలో ప్రజలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు మరింత జవాబూదారీతనంతో  సేవలను అందించేందుకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.  ఇప్పటి వరకు ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, అలాగే ఒక మేయర్, ఒక డిప్యూటీ మేయర్‌లు వుంటే, ఇకపై అదనంగా మరో వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్లు వుండేలా ఆర్డినెన్స్ తీసుకువస్తామని ఆయన తెలిపారు.  ఈ నెల 18వ తేదీన యుఎల్‌బిసిల్లో చైర్మన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాలని ఎస్‌ఇసి నోటిఫికేషన్ ఇచ్చిందని దాని ప్రకారం ఎన్నిక జరుగుతుందన్నారు.   ఆర్డినెన్స్ తరువాత రెండో వైస్ చైర్మన్, రెండో డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారని క్లారిటీ ఇచ్చారు.

  ప్రజలకు అందుబాటులో వుండి, మరింత సేవ చేసేందుకు గానూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎక్కువ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో సీఎం   వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  దీనివల్ల జవాబూదారీతనం కూడా పెరుగుతుందనన్నారు.

చంద్రబాబుపై తమకు ఎటువంటి కక్షసాధింపు లేదని, అమరావతి భూదందాలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిఐడి విచారిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.  క్షేత్రస్థాయిలో జరుగుతున్న విచారణలో భాగంగానే చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేసిందన్నారు.