Connect with us

ఆంధ్రప్రదేశ్

ఎంఎల్సి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Published

on

Spread the love
  • మొత్తం 30 వేల 927 మంది ఓటర్లు, 227 పోలింగ్ కేంద్రాలు * ఉ.8 గం.ల నుండి సా.4 గం.ల వరకూ పోలింగ్.
  • మావోయిస్టు ప్రభావిత రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు,  జంగారెడ్డిగూడెం డివిజన్లలో 8గం.ల నుండి మ.2గం.ల వరకే పోలింగ్.
  • 2వేల 200 మంది పోలింగ్ సిబ్బంది. *2వేల 400 మంది పోలీస్ సిబ్బంది.
  • కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు.

అమరావతి,13 మార్చి : ఈనెల 14న జరిగే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి 2 ఉపాధ్యాయ ఎంఎల్సి స్థానాల ఎన్నికల నిర్వహణకు ఆయా జిల్లా యంత్రాంగాలు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ శనివారం నాడు తెలిపారు.

ఈ రెండు నియోజకవర్గాల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 30 వేల 927 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సిఇఒ పేర్కొన్నారు. మొత్తం 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ నిర్వాహణకు 2వేల 200 మంది పోలింగ్ సిబ్బందిని, బందోబస్తు నిర్వహణకు 2వేల 400 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని చెప్పారు.

పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు రెండు నియోజకవర్గాల్లో ఒక్కో ఎన్నికల పరిశీలకుని నియమించినట్లు తెలిపారు. అలాగే ఆయా పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు ఏవిధంగా అమలు చేస్తున్నారనేది పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని నియమించామని విజయానంద్ పేర్కొన్నారు.

కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఈ.8గం.ల నుండి మధ్యాహ్నం 2గం.ల వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుందని విజయానంద్ స్పష్టం చేశారు.

పోలింగ్  కేంద్రాల్లో ఇచ్చే వయొలెట్ రంగు స్కెచ్ పెన్ తో మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, సిబ్బందికి మాస్క్,గ్లౌజులు వంటివి సమకూర్చడం తోపాటు సానిటైజర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.

ఉపాధ్యాయ ఎమెఎల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్నవారందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయానంద్ విజ్ఞప్తి చేశారు.