Connect with us

ఆంధ్రప్రదేశ్

ఏలూరుపై ఇలా చేద్దాం !

Published

on

Spread the love

అమరావతి, మార్చి : పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన  ఏలూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు వింత వ్యాధులతో ఇటీవల అవస్థలు పడిన నేపథ్యంలో దానికి కారణమైన అస్సలు సమస్యను పరిష్కరించేదిశగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. వింత వ్యాధులకు ఏలూరు కాలువ నీటి కాలుష్యమే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ కాలువ నీటి కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖతో సహా సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సోమవారం నాడు ఆదేశించారు.

ఏలూరు ఘటనపై వచ్చిన నివేదికలను పరిశీలిస్తున్న సిస్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు

ఇదీ కార్యాచరణ

  •  ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటి టెస్టింగ్, ఇతర పరిశోధనలు కొనసాగించాలి.  మరో ఆరు నెలల పాటు కొనసాగించాలి.
  • కార్లు, ఇతర వాహనాల వాషింగ్ వంటి చర్యలను కాలువ నీటిలో ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు.
  • శాశ్విత ప్రాతిపదికన ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
  • రైతులు వినియోగించే ఎరువులు,పురుగు మందులు నాణ్యత కలిగినవిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.  ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహించాలి.
  •  సేంద్రీయ, నేచరల్ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలి.   

గత డిశంబరులో ఏలూరు పరిసర ప్రాంతాల్లో అకస్మాత్తుగా మూర్చ, స్పృహ కోల్పోవడం ( Convulsions and loss of Consciousness) వంటి లక్షణాలతో సుమారు 622 మంది ప్రజలు ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయిలో ఒక మల్టీ డిసిప్లెనరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆకమిటీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించి పరిస్థితిని అధ్యయనం చేసింది.

ఈ నేపధ్యంలో అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన కమిటీ మరో మారు సమావేశమై ఈ సంఘటనకు సంబంధించి వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలపై చర్చించింది. దీంతోపాటు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

ఈ సందర్భంగా సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ ఏలూరు కాలువపై తక్షణం కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోను కార్లు, తదితర వాహనాల వాషింగ్ కు అనుమతించవద్దని స్పష్టం చేశారు. మరో ఆరు మాసాల వరకూ తాగునీరు తదితర టెస్టులను కొనసాగించాలని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మరియు గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు. మంచినీటి సరఫరా వ్యవస్థ పైపులైన్లన్నిటినీ పూర్తిగా తనిఖీ చేసి సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. రైతులు వినియోగించే ఎరువులు,పురుగు మందులు నాణ్యత కలిగినవిగా ఉండేలా చూడడంతో పాటు ఎప్పటికప్పుడు టెస్టులు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.

అంతకు ముందు ఈ సంఘటనకు సంబంధించి ఎయిమ్స్, ఐఐసిటి, నీరి తదితర జాతీయ సంస్థలు అందించిన పరిశోధన నివేదికలు సిఫార్సులపై సిఎస్ సమీక్షించారు. రైతుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్, నాచురల్ ఫార్మింగ్ పట్ల ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కాలువపై జలకాలుష్యం నివారణకు పూర్తి స్టడీ నిర్వహించి అవసరమైన కార్యాచరణను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

        అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏలూరు సంఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. గత డిశంబరు 1న మూర్చ, స్పృహ కోల్పోడం వంటి లక్షణాలతో తొలి కేసు నమోదు కాగా వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే నిర్వహించి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. డిశంబరు 13 నాటికి కేసులు ఏమీ రిపోర్టు కాలేదని చెప్పారు. వివిధ శాఖల వారీగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ తరుపున డిపిఆర్ ను సిద్ధం చేశామని వాటి అమలుకు చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపారు.

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్మి, ప్రణాళికాశాఖ కార్యదర్శి జి ఎస్ఆర్ కె విజయకుమార్, వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.