Connect with us

ఆంధ్రప్రదేశ్

ఏపి ‘ఉపాధి’ రికార్డు

Published

on

Spread the love
అమరావతిలోని సచివాలయంలో ఈ నెల 5న జరిగిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్న అధికారులు
  • ఇప్పటి వరకు 23.67 కోట్ల పనిదినాల కల్పన
  • పిఎంజిఎస్‌వై కింద 3,185 కిలోమీటర్ల మేర రహదారులు
  • ఈ ఏడాది 19,21,050 ఇళ్ళకు కుళాయిలు అందించాలని లక్ష్యం
  • వైయస్‌ఆర్ జలకళ బోర్ల మధ్య దూరం పరిమితి తగ్గింపు

ఉపాధి హామీ పనుల కల్పనలో  ఈ ఆర్థిక సంవత్సరంతో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత పనితీరు కనబర్చించింది.  రికార్డు స్థాయిలో కోట్లాధి మందికి పని కల్పించింది.  ఈ విషయాన్ని  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.  మహాత్మాగాంధి జాతీయ ఉపాధి పథకం, వైయస్‌ఆర్ జలకళ, పిఎంజిఎస్‌వై, జల్‌ జీవన్ కార్యక్రమాల అమలును ఆయన ఇటీవల సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పిఆర్ ఇఎన్‌సి సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఎన్‌సి కృష్ణారెడ్డి, వాటర్‌ షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, అన్ని జిల్లాల డ్వామా పిడిలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ….

మీడియాతో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

         ‘‘ఈ ఏడాది కేంద్రప్రభుత్వం 25.25 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కింద రాష్ట్రానికి  కేటాయించింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటి వరకు 23.67 కోట్ల పనిదినాలను పేదలకు కల్పించాం. ఈ నెలాఖరు నాటికి మిగిలిన పనిదినాలను కూడా పూర్తి చేస్తాం. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక రికార్డు. దీనికోసం ఇప్పటి వరకు సుమారు వేతన పనిదినాలకు రూ.5423 కోట్లు ఖర్చు చేశాం. ఈ నెలాఖరు నాటికి మొత్తం రూ. ఆరువేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆస్థులను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామసచివాలయాలు, అంగన్ వాడీ, వెల్‌నెస్ సెంటర్లు, ఆర్బీకెలు తదితర భవనాల కోసం అరవై శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద మొత్తం రూ. నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిలో ఇప్పటి వరకు రూ.3,086 కోట్లు ఖర్చు చేశాం.’’  అన్నారు.

గ్రామీణ రహదారులకు మహర్థశ

పిఎంజిఎస్‌వై కింద రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్థశ కల్పిస్తున్నామని మంత్రి  తెలిపారు. ‘‘టిడిపి హాయంలో  ఒక్క రోడ్డు కూడామంజూరు కాలేదు. ఈ ఏడా ది రాష్ట్రంలో 3,185 కిలోమీటర్ల మేర పిఎంజిఎస్‌వై కింద రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి విడత కింద రూ.524.36 కోట్లతో 935.84 కిలోమీటర్ల మేర  పనులు ప్రారంభించాం. రెండో విడతలో రూ.766.54 కోట్ల అంచనా వ్యయంతో 1378.54 కిలోమీటర్లు మంజూరయ్యాయి. ఇప్పటికే బ్యాలెన్స్‌ పనుల కింద గుర్తించిన 970.62 కిలోమీటర్లకు డిపిఆర్‌లు తయారవుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఈ డిపిఆర్‌లను కేంద్రానికి మంజూరీ కోసం పంపుతున్నాం. ’’ అని రామచంద్రారెడ్డి వివరించారు.

ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి

జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని అందించబోతున్నామని మంత్రి తెలిపారు. ‘‘ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది మొత్తం 19,21,050 ఇళ్ళకు కుళాయిలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిలో భాగంగా  ఈ ఏడాది జనవరి నాటికి 4,60,118 కుళాయిలను అందించగా, ఈ నెల ప్రారంభంలోనే 9,41,731 కుళాయిలను అందించాం. అంటే 49.02 శాతం లక్ష్యాన్ని సాధించాం. ఈ నెలాఖరు నాటికి మొత్తం ఆరు లక్షల కనెక్షన్లు ఇవ్వాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులను ఆదేశించాం.’’ అని ఆయన వివరించారు.

జలకళ కింద రూ.4వేల కోట్లు

వైయస్‌ఆర్‌ జలకళ పథకం కోసం మూడేళ్ళలో మొత్తం రూ.4వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ‘‘వ్యవసాయ బోర్ల కోసం రైతులు అప్పులు పాలు కాకూడదనే మంచి ఆశయంతో సీఎంగారు తలపెట్టిన ఈ పథకం కింద ఉచితంగా బోర్లతో పాటు మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను కూడా అందిస్తున్నాం. ప్రస్తుతం డీజిల్ రేట్లలో పెరుగుదల నేపథ్యంలో డ్రిల్లింగ్ చేసే వారు కూడా నష్టపోకుండా రేట్ల ఎక్సలేషన్ కు అనుగుణంగా చెల్లింపులు జరుపుతున్నాం. బోర్ల మధ్య దూరంను గతంలో రెండు వందల మీటర్ల మేరకు పరిమితం చేస్తే, దానిని కూడా రైతుల విజ్ఞప్తి మేరకు దూరం తగ్గించడం జరిగింది. ’’ అని తెలిపారు.