Connect with us

పర్యాటకం

గోవింద రాజుల రాతి విగ్రహం ఎక్కడ…?

Published

on

Spread the love

పురాణాల ప్రకారం.. తిరుమలలోని శ్రీనివాసునికి అన్న గా పేర్కొన్న గోవింద రాజులు తిరుపతి వైభవాన్ని మరింత పెంచాడు. ఒకప్పుడు తమిళనాడులోని చిదంబరంలో ఉండే గోవింద రాజులు రామానుజాచార్యుల చొరవతో తిరుపతికి తరలివచ్చారు. అయితే ఇప్పుడు గోవింద రాజల ఆలయంలో ఉన్న విగ్రహం సుద్దతో చేసిన విగ్రహం. సాధారణంగా ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి కదా! వాస్తవానికి ఇక్కడ కూడా తొలుత రాతి విగ్రహాన్నే ఏర్పాటు చేయాలని చేయించారు. కానీ సుద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రాతి విగ్రహం ఏమైంది… సుద్ద విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనే కుతుహలం కలగకమానదు. దానికి మన పురాణాల్లో ఒక కథ ఇలా ఉంది.

తిరుపతిలో ఉన్న రామచంద్ర పుష్కరిణి సమీపంలో గోవింద రాజుల రాతి విగ్రహం

చిదంబరంలో నటరాజుడితో సమానంగా పూజలు అందుకుంటున్న గోవిందరాజులను కుళోత్తుంగ చోళుడు స్థాన భ్రష్ఠం చేసి సముద్రం పాల్జేశాడు. అదే సమయంలో కొందరు భక్తులు గోవింద రాజుల ఉత్సవ ప్రతిమను తీసుకుని తిరుపతికి వచ్చారు. అప్పుడు రామానుజాచార్యుల వారు కూడా తిరుపతిలోనే ఉండేవారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న రామానుజులు… తిరుపతిలోనే గోవింద రాజుల ఆలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికి నాటి యాదవ రాజు సహకారం లభించింది. అద్భుతమైన నగరంగా గోవింద రాజుల ఆలయం రూపు దిద్దుకుంది.

గోవింద రాజుల ఆలయం

విగ్రహం కథ ఇక్కడే మొదలైంది
గోవింద రాజుల విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ఉద్దేశంతో శిల్పుల చేత ఓ విగ్రహాన్ని చెక్కించారు. అయితే అందులో కొన్ని లోపాలను గుర్తించిన రామానుజులు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రామానుజులు దేశ పర్యటనకు వెళ్ళాల్సి వచ్చింది. దీంతో సుద్ద విగ్రహాన్ని ప్రతిష్టించి వెళ్లారు. నాటి నుంచి నేటి వరకూ సుద్ద విగ్రహమే గోవింద రాజుల ఆలయంలో పూజలు అందుకుంటుంది. అందుకే ఇక్కడ అభిషేకాలు ఉండవు. నూనెను మాత్రమే పూస్తారు.

మరి రాతి విగ్రహం ఏమైంది..?

తిరుపతిలో ఉన్న రామచంద్ర పుష్కరిణి సమీపంలో గోవింద రాజుల రాతి విగ్రహం

తిరుపతిలో మంచినీటి కుంటగా పిలిచే నృసింహ తీర్థం ఒకటి ఉంది. ఈ గోవింద రాజుల రాతి విగ్రహాన్ని అక్కడే ఉంచారు. నాటి నుంచి నేటి వరకూ ఆలనా పాలనా లేక ఆ విగ్రహం అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తిరుపతిలో ఉన్న రామచంద్ర పుష్కరిణి ఎదురుగా ఉండే మంచి నీటి కుంట వద్ద ఇప్పటికీ గోవింద రాజుల రాతి విగ్రహాన్ని చూడవచ్చు.