Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆటోడ్రైవర్లకు టోకెన్ !

Published

on

Spread the love

రోజువారీ పెరిగిపోతున్న ట్రాఫిక్ చిక్కులకు విజయవాడ పోలీసులు వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చారు. అదే టోకెన్ విధానం. ట్రాఫిక్ నియంత్రణకు ఈ విధానం సత్ఫలితాలు ఇస్తున్నా డ్రైవర్ల ఆదాయానికి భారీగా గండి కొడుతోంది. దీంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలో సతమతమౌతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల్లో నిత్యం లక్షలాది మంది ప్రజలను గమ్యస్థానలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్లకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న డ్రైవర్లు తాజాగా తీసుకొచ్చిన టోకెన్ విధానంతో పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా రాజధానిలో కీలక ప్రాంతమైన మంగళగిరిలో పోలీసులు అనేక రకాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య రోజుకు వేల సంఖ్యలో ప్రయాణీకులు వెళ్తుంటారు. మంగళగిరి పట్టణంలో ప్రయాణీకుల హడావుడి ఎక్కువగానే ఉంటుంది. వీరికి అధిక భాగం ఆటోలే గతి. ఆర్టీసి బస్సులున్నా వారధి వైపు చాలా తక్కువ ఉండటంతో షేరింగ్ ఆటోల్లోనే ప్రజలు ప్రయాణిస్తుంటారు.

ఆటోలు వరుస కట్టిన దృశ్యం (ప్రతీకాత్మక చిత్రం)


మంగళగిరి నుండి వందల సంఖ్యలో ఆటోలు తిరుగుతాయి. బెంజి సర్కిలు ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు, ప్లై ఓవర్లు నిర్మిస్తున్న దరిమిలా విజయవాడలో్ ట్రాఫిక్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కొత్తగా టోకెన్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. టోకెన్ సిస్టమ్ లేని సమయం లో విజయవాడ-మంగళగిరి మార్గం మధ్యలో ఎక్కడ బడితే అక్కడ ప్రయాణీకులను ఎక్కించుకునేవారు ఆటోడ్రైవర్లు. బాడుగ బళ్ల డ్రైవర్లు కూడా ఆటో అద్దె పోగా, కుటుంబ పోషణకు కొంత సంపాదించుకునే వారు. నేడు ఆ పరిస్థితి లేదు. పోలీసు ఆంక్షలు వల్ల ఆదాయం తగ్గిపోయింది. బాడుగ ఆటోడ్రైవర్లయితే ఆటో అద్దె కూడా రాని పరిస్థితి ఏర్పడింది. పట్టణం లో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ పెరిగిన మాట వాస్తవమే. అయినప్పటికి పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే ఏర్పాట్లు చేయాలి. ఆటోలకు టోకెన్ సిస్టమ్ ఎత్తివేయాలని కోరుతున్నారు.

టోకెన్ సిస్టమ్ వల్ల ఆదాయం కోల్పోతున్నామని పలువురు ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే మంగళగిరి బస్ స్టాండ్ పాయింట్లో టోకెన్ ఉన్న ఆటో లను మాత్రమే ప్రవేశం కల్పిస్తున్న పోలీసులు ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా అన్ని ఆటోలకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. టోకెన్ సిస్టమ్ వల్ల ఎక్కువ ట్రిప్పులు పడడం లేదని దీని కారణంగా ఆదాయం తగ్గిపోతుంది అని అంటున్నారు. తమ జీవనాధారం పై పోలీసులు విధించిన ఆంక్షలు భారంగా మారాయని అంటున్నారు.

ఇంతకీ ఏంటి ఈ టోకెన్ విధానం?

విజయవాడలో ఆటోలను తనిఖీ చేస్తున్న పోలీసులు

ప్రధాన కూడళ్లలో ఆటో డ్రైవర్ల యూనియన్లను గుర్తిస్తారు. ఆ తర్వాత ఆయా యూనియన్లు లేదా నిర్ధిష్ట ఆటో స్టాండ్లలో నమోదైన ఆటో డ్రైవర్లకు టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లు ఉంటేనే విజయవాడ లేదా ఇతర ప్రాంతాలకు పోలీసులు అనుమతిస్తారు. టోకెన్ లేకపోతే అంతే సంగతులు. అంటే టోకెన్ కోసం ఆటోలు సీరియల్ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి. ఎక్కడి పడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోరాదు. దారి మధ్యలో అస్సలు ఎక్కించుకోరాదు. ఇప్పుడు ఈ నిబంధనే ఆటో డ్రైవర్ల రోజువారీ ఆదాయానికి గండి కొడుతోంది.