Spread the love

భారతదేశంలోనైనా సరే, ప్రపంచంలో మరో దేశంలోనైనా సరే కమ్యూనిస్టు, సోషలిస్టు, డెమొక్రటిక్, లేది విప్లవ, ప్రగతిశీల పార్టీలకు సొంత పత్రికలు ఉంటాయి. మసుగు పత్రికలు వుండవు. సామ్యవాద, వామపక్ష, ప్రజాతంత్ర భావాలను తమతమ పత్రికల ద్వారా నేరుగా ఇది మా వైఖరి అంటూ స్పష్టతనివ్వడం ఈ తరహా రాజకీయ పార్టీలకు అలవాటు. ఇదంతా ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ర్టాల్లో వామపక్ష ఉద్యమాలకు, పార్టీలకు సమాచార వేదికగా ఉన్న ప్రజాశక్తి దినపత్రికకు సంబంధించి ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తి కన్నుమూశారు. ఆయన పేరు పావెల్. అసలు పేరు వానపల్లి అప్పలరాజు. మాగ్జీంగోర్కీ ‘అమ్మ’నవల తో ప్రభావితుడైన అప్పలరాజు తన పేరును ఆ నవలలోని కధానాయకుడైన పావెల్ గా మార్చుకుని ‘ఆంధ్రా పావెల్’ అయ్యారు.

ప్రజాశక్తి మాస్టర్ హెడ్ ఇదే

పావెల్‌ వృత్తి రీత్యా పెయింటర్‌. చేయి తిరిగిన చిత్రకారుడు, రాతగాడు. విశాఖతీరంలో ఆయన బ్రష్ పడని గోడ అంటూ ఏదీ ఉండదేమో! ప్రజాశక్తి ప్రస్తుత మకుటం (మాస్టర్ హెడ్) ఆయన కుంచె నుంచి జాలువారినదే. వామపక్షాల సభలు, సమావేశాలకు గోడ రాతలు రాసేది ఆయనే. నినాదాలు రాసేది ఆయనే. ఉభయ రాష్ర్టాల్లో ఎక్కడ సభలు జరిగినా ఆయనే పెద్ద ప్రచార కర్త. జీవితాంతం కమ్యూనిస్టు ఆశయాలతో బతికిన ఆయన కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ సెప్టెంబరు 8న మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని వైద్య పరీక్షల కోసం విశాఖపట్నంలోని కెజిహెచ్ ఆసుప్రతికి దానం ఇచ్చారు. బతికినంతకాలం చిల్లిగవ్వ సాయం కూడా చేయకుండా సమాజాన్ని రాకాసి గద్ధల్లా పీక్కుతునే బుద్ధీహీనులున్న ఈ రోజుల్లో మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడే పావెల్ వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. కాకపోతే వామపక్ష పార్టీల్లో ఇలాంటి ఆదర్శప్రాయులు అధికంగా ఉంటారు. తెలుగునేల అడుగడుగునా కుంచెతో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన పావెల్ తర్వాత కాలంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఫ్లెక్సీల ప్రభావంతో పెయింటింగ్‌ షాపులు మూతపడ్డాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల షాపు అమ్ముకొనేవరకు పావెల్‌ ఆర్ట్స్‌కు డిమాండ్‌ తగ్గలేదు. పెయింటింగ్‌ రంగానికి సంబంధించిన జాతీయ పత్రికలు తెప్పించుకుని అధ్యయనం చేసేవారు. ఎంతో మందికి తనకొచ్చిన చిత్రకళను నేర్పి కళా వారసత్వపు బీజాలు నాటి వెళ్లారు.

'మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల మహాసభల నేపథ్య చిత్రాలన్నీ పావెల్‌ కుంచె నుంచి జాలువారినవే. ప్రతి బ్యాక్‌డ్రాప్‌ ఎంతో అర్ధవంతంగానూ, వర్గ దృక్పథంతోనూ వుండేవి. ఆయన కుంచె తగలని జిల్లా రాష్ట్రంలో లేదని చెప్పవచ్చు. మేము ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకొనే రోజుల్లో గోడలన్నీ ఎస్‌ఎఫ్‌ఐ రాతలతో నిండడానికి కారణం పావెల్‌. తన కుటుంబాన్ని పార్టీ కుటుంబంగా తీర్చిదిద్దాడు పావెల్‌. భార్య ఉమ ఐద్వా జోన్‌ కార్యదర్శిగానూ, కుమార్తెలు క్రాంతి, స్రవంతి ఎస్‌ఎఫ్‌ఐ లోనూ, తమ్ముడు అప్పలరాజు సిఐటియు లో చురుగ్గా పని చేశారు. పార్టీ ప్రతి క్యాంపెయన్‌, ఎన్నికల ప్రచారం, మహాసభల సమాచారాన్ని పావెల్‌ పెద్ద అక్షరాలతో గోడలు నింపేవాడు. సుత్తి కొడవలి, ప్రతి అక్షరం 8 అడుగుల ఎత్తు వుండేవి. కుంచె కింది నుంచి చేతికి అందినంత ఎత్తు వరకు వెళ్లేది. ఈ ఒరవడి 2014 అఖిల భారత పార్టీ మహాసభల వరకు సాగింది. ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొనే పావెల్..సహాయక చర్యల్లోనూ ముందుడేవారు. కమ్యూనిస్టు అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం పావెల్‌.'                   
  - సిహెచ్ నరసింగరావు, సిపిఎం నేత (ప్రజాశక్తి నుంచి సంగ్రహం) 

మకుటం అంటే ఏమిటి?
పత్రికలకు పేరు ఎంత ప్రాముఖ్యమో..మాస్టర్ హెడ్ గా పాత్రికేయ పరిభాషలో పిలుచుకునే మకుటం కూడా అంతే ముఖ్యం. ప్రతి పేపర్ మాస్టర్ హెడ్ వెనుకా పెద్ద మేధోమథనమే జరిగివుంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ద హిందూ, సాక్షి ఇలా ప్రతి పత్రికకూ మొదటి పేజీలో ఆ పేరు ను సూచిస్తూ పెద్ద అక్షరాలతో రాసివుండేదే మకుటమంటే. రాజుకు కిరీటం ఎలాగో..పత్రికకు మాస్టర్ హెడ్ అలాగన్నమాట. మాస్టర్ హెడ్ కంటే పెద్ద అక్షరాలతో ఒక వార్త రాశామంటే ఇక వార్త చాలా చాలా ప్రభావితమైన వార్త అని అర్థం. పత్రికలు ఎవరి సిద్ధాంతాలనైతే అనుసరిస్తుంటారో లేదా ప్రస్తుత కాలానికి అనుగుణంగా చెప్పుకోవాలంటే పత్రికలు ఎవరి భజన చేస్తుంటాయో సంబంధిత ముఖ్యులు భువిని వీడితే మాస్టర్ హెడ్ ను కూడా జెండాను అవనతం చేసినట్టు కిందకు దించేస్తాయి. మాస్టర్ హెడ్ కు ఉన్న ప్రాముఖ్యత అది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!