Connect with us

ఫీచర్లు

సామాజిక చైతన్య స్ఫూర్తి సు”గంధం”

Published

on

Spread the love

ఆటుపోట్లను..సుడిగుండాలను విజేతలు ఒక ఆటవిడుపు గా తీసుకుంటారు. ప్రస్తుతం అనంతపురము జిల్లా కలెక్టరుగా ప్రజలతో మమేకమై అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న గంధం చంద్రుడు కూడా అంతే. ఆయన అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ ఆయన ఏనాడూ వాటిని కష్టాలుగా చూడలేదు. జీవితంలో ఎదిగేందుకు గొప్ప అవకాశాలుగా మలుచుకున్నాడు. ప్రాథమిక పాఠశాలలో చదివే రోజుల్ల్లో ఎం పుల్లయ్య సార్ దిశానిర్దేశాలు మొదలుకొని రైల్వే టిక్కెట్టు కలెక్టరు వరకు ఇప్పడు ఐఎఎస్ అధికారి దాకా ప్రతి దశలోనూ ఆయన నేర్చుకున్న ప్రతి పాఠాన్ని నిత్యం అనువర్తించుకుంటూ విజయపథాన దూసుకుపోతున్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి ప్రజలు మెచ్చిన ఐఎఎస్ అధికారిగా ఎదిగిన ఒక స్పూర్తిదాయక ధ్రువతార గంధం. కష్టాల కడలి నుంచి ఉబికివచ్చిన విజయపు కెరటం.

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామంలో నిరుపేద వ్యవసాయ కార్మికుల కుటుంబంలో గంధం చంద్రుడు జన్మించారు. వారి కుటుంబంలో ఉన్నత విద్యనభ్యసించిన తొలి తరం గంధం చంద్రుడే. మొదటి గ్రాడ్యూయేట్ కూడా ఆయనే. దక్షిణ మధ్య రైల్వే జోన్ (ఎస్.సి.ఆర్.జెడ్)లో రైల్వే టిక్కెట్టు కలెక్టరుగా ఉద్యోగం సంపాదించడం గంధం చంద్రుడి జీవితంలో గొప్ప మైలురాయి. వారి కుటుంబంలో కానీ, సమీప పరివారంలో కానీ అంత వరకూ ఎవ్వరూ కూడా ప్రభుత్వ కొలువు చేసింది లేదు. చాలా మందికి రైల్వే టిక్కెట్టు కలెక్టరు అంటే ఆ ..ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఇన్నేళ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ చదువు సంద్యలెరగని పేద కుటుంబాలెన్నో.. అలాంటి ఒక అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ..ఉన్నత విద్యనభ్యసించడం..ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే మాటలు కాదు. నిజంగా అదో గొప్ప విజయం. చిరస్మరణీయ మైలురాయి. కానీ గంధం చంద్రుడి అంతటితోనే సరిపుచ్చుకోలేదు. సాధించాల్సింది ఇంకా ఏదో ఉంది అంటూ విజయతీరాలను అన్వేషిస్తూ ముందడుగేస్తూ వెళ్తున్నారు. ఇప్పడు ఆయన విజయ ప్రస్థానం అనంతపురము జిల్లా కలెక్టరుగా విజయవంతంగా సాగిపోతోంది.

అంగన్ వాడీ కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళల బాగోగులు తెలుసుకుంటున్న గంధం చంద్రుడు
విద్యాభ్యాసం
ప్రాథమిక పాఠశాల విద్య ఐదవ తరగతి వరకు సొంతూరు కోటపాడులోనే సాగింది. అక్కడే గంధం చంద్రుడిలోని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు ఎం పుల్లయ్య జవహార్ నవోదయ విద్యాలయంలో చేరాలని సూచించారు. ఉపాధ్యాయుడి ఇచ్చిన సూచనలతో కష్టపడి..ఇష్టపడి చదివి జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష రాశారు. కర్నూలు జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించి అదే జిల్లాలో ఎమ్మిగనూరు మండలంలో ఉన్న బనవాసిలోని జవహార్ నవోదయ విద్యాలయం (జె.ఎన్..వి)లో సీటు సంపాధించారు గంధం చంద్రుడు.

జవహార్ నవోదయ విద్యాలయంలో పదో తరగతి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పడు ఏం చేయాలి? ఇంటర్ చేస్తే మళ్లీ పై చదవులు చదవాలి. కుటుంబానికి భారం. అందుకే చిట్టి గంధం బుర్రలో చురుకైన ఆలోచన తట్టింది. ఇంటర్మీడియట్ చేస్తూనే రైల్వేలో ఉద్యోగానికి అవసరమైన ప్రత్యేక స్కిల్స్ నేర్పించే కోర్సు ఒకటుందని ఎవరో చెబితే విన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ తో పాటే అందించే ఈ ఒకేషనల్ కోర్సు చేస్తే జాబ్ పక్కా. అందుకే ఈ కోర్సులో చేరడానికి విపరీతమైన పోటీ ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే లక్షలాది మంది విద్యార్థుల నుంచి పోటీ పడాలి. పోటీని ఎదుర్కొంటూ వచ్చిన గడుగ్గాయి కాబట్టే గంధానికి ఈ పరీక్ష పెద్ద కష్టమనిపించలేదు. అంతే ఇక రెండో ఆలోచన చేయలేదు. పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఒకేషనల్ కోర్సు ఇన్ రైల్వే కమర్షియల్ (వి.సి.ఆర్.సి)లో సీటు వచ్చేసింది. సికింద్రాబాద్ రైల్వే జూనియర్ కళాశాలలో ఇంటర్, రైల్వే కోర్సు పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో టిక్కెట్టు కలెక్టరుగా ఉద్యోగం రానే వచ్చింది. ఉద్యోగం వచ్చేసింది కదా. ఇంకేం హాయిగా కాలం వెళ్లదీద్దామనుకోలేదు ఈ చంద్రుడు. చీకటి గదిలో ఉన్నప్పుడే తెరిచిన కిటికి కనిపిస్తుంది. విజయపథ అన్వేషకులు కూడా కష్టాల్లోనే గెలుపుదారులు గుర్తిస్తారు. ఫుల్ టైమ్ జాబ్ కావడంతో రెగ్యూలర్ కాలేజీకి వెళ్లే వీలు లేకుండా పోయింది. అందువల్ల ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో ఉన్నత చదువులు పూర్తి చేయాలని గంధం చంద్రుడు నిర్ణయించుకున్నారు. కామర్స్ లో డిగ్రీని, ఆ తర్వాత పబ్లిక్ పాలసీలో పోస్టు గ్రాడ్యూయేషన్ ఇగ్నోలోనే డిస్టెన్స్ లో పూర్తి చేశారు.

వేరుశనగ విత్తనాలు వేస్తున్న రైతులతో కలిసి పొలంలో విత్తన కొర్రు (నాగలి) దున్నుతున్న గంధం చంద్రుడు

వాస్తవానికి ఇంటర్ అయిపోగానే ఉద్యోగం చేయాలని గంధం ఆలోచించలేదు. కుటుంబ ఆర్థిక కష్టాల మూలాన కాలేజీ మధ్యలోనే ఆపేసిన తన అన్న పరిస్థతి గంధానికి గుర్తుకొచ్చింది. తన అన్నను కూడా తిరిగి ఉన్నత చదువులు చదివించాలని గంధం తపన పడ్డారు. అందుకే ఇంటర్ తర్వాత వెంటనే ఉద్యోగం వచ్చే బాట ఎంచుకున్నారు. విజయపథంలో ఉద్యోగం రానే వచ్చింది. నెలనెలా బ్యాంకులో వేతనాలు వస్తుండటంతో అన్నను కూడా కాలేజీకి తిరిగి పంపించారు. ఆయన ఉన్నత విద్యను పూర్తి చేసి ప్రస్తుతం ఒక కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అది గంధం చంద్రుడు అంటే.

రైల్వే టిక్కెట్టు కలెక్టరుగా తొమ్మదేళ్ల పాటు పని చేసిన అనంతరం గంధం చంద్రుడి ఆలోచనలు సివిల్స్ సర్వీసెస్ వైపు మళ్లాయి. ఇంతటితో సరి పెట్టుకోకూడదు ప్రజలకు మరింత చేరువయ్యే కొలువు ఏదైనా చేపట్టాలని తపన పడ్డారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు గురి పెట్టారు. గంధం గురి పెడితే లక్ష్యం చేరకుండా ఉంటుందా?

ఉపాధి కార్మికులతో వారి భోజన విరామ సమయంలో ముచ్చటిస్తున్న గంధం చంద్రుడు

ఒక వైపు ఉద్యోగం..మరో వైపు సివిల్స్ ప్రిపరేషన్. రేయంబవళ్లూ కష్టపడ్డారు. కానీ ఇంకా వెలితి. ప్రిపరేషన్ చాలదేమోనని ఆందోళన. పోనీ సెలవులు పెట్టేసి ప్రిపేర్ అవుదామంటే పరిమితికి మించి సెలవులు ఇవ్వడానికి వీలు కుదరదు. దీంతో తన విధులను పర్యవేక్షించే పై అధికారికి చిన్న వెసులుబాటు కల్పించాలని గంధం చంద్రుడు విన్నవించుకున్నారు. రైళ్లలో పగటి పూట అయితే రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి రాత్రి వేళల్లో రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరత్వరగా పని ముగించేసుకొని ప్రిపేర్ కావచ్చని ఆలోచించారు. ఇదే విషయాన్ని తన సూపర్ వైజర్ కు వివరించి రాత్రి వేళ డ్యూటీ వేయించుకున్నారు గంధం. ఆ తర్వాత ప్రిపేరషన్ కాస్త సంతృప్తికరంగా సాగిపోయింది. 2009లో పరీక్ష రాసే ముందు ఒక ఏడాది పాటు గంధం చంద్రుడు ఇలానే కష్టపడి చదివారు. కష్టం ఫలించింది..అఖిల భారత స్థాయిలో 198 వ ర్యాంకు గంధం వశమైంది. ఆంధ్రప్రదేశ్ కేడర్ కు ఎంపికయ్యారు.

మూలాలను మరువని గంధం
ఒక జిల్లా కలెక్టరుగా అత్యున్నత పదవిని అలంకరించినా గంధం చంద్రుడు తన మూలాలను ఏమాత్రమూ మర్చిపోలేదు. సివిల్స్ దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత మొట్ట మొదట తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం లో ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. రంపచోడవరంలో కొండ రెడ్లు, కొండ కమ్మర, కొండదొర, కొండ కాపు, వాల్మీకి వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు నివసిస్తారు. 2012 సెప్టెంబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు గంధం చంద్రుడు ఇక్కడే పని చేశారు. అణగారిన ప్రజల కష్టసుఖాల్లో ఆయన మమేకయ్యారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఒక్క సారిగా ఎన్నికల్లో ఓటు వేసే భాగ్యాన్ని చవిచూడని ఎంతో మంది గిరిజనులను ఆయన పోలింగ్ కేంద్రాల వైపు నడిపించారు. 20 వేల మంది పైగా గిరిజనులను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఓటర్ల జాబితాలో చేర్పించారు.

ఏడాదిలోనే ఎన్నో..,.
రంపచోడవరం గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టరుగా గంధం చంద్రుడు 2014-15 ఏడాది పాటే పని చేసినా అక్కడ గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. రహదారుల నిర్మాణం, మంచి నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎంతో కృషి చేశారు. గిరిజనుల జీవనోపాధులను పెంచేందుకు మెరుగైన అదనపు వనరులను అన్వేషించి ఆచరణసాధ్యం చేశారు. ప్రత్యేకించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎన్.ఆర్.ఇ..జి.ఎ) ద్వారా కల్పించాల్సిన ఉపాధి పని దినాల లక్ష్యాలను సాధించి వారికి అందాల్సిన వేతనాలను సకాలంలో అందేలా చూశారు.

విజయవాడలో..
2015లో విజయవాడ జాయింట్ కలెక్టరుగా గంధం చంద్రుడు నియమితులయ్యారు. 2018 వరకు విజయవాడలోనే పని చేశారు. ఒక వైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే 2016లో జరిగిన కృష్ణా పుష్కరాలను కూడా ఆయన ఘనంగా నిర్వహించడంలో కీలక పాత్ర వహించారు. 12 రోజుల పాటు 2.5 కోట్ల మంది ప్రజలు ఈ పుష్కరాల్లో పాల్గొన్నారు. వీరందరికీ కనీస సౌకర్యాలు కల్పించి గంధం చంద్రుడు అందరి మన్ననలూ పొందారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా విధులు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా ప్రత్యేక రాయితీలతో రుణాలు అందజేసే వేలాది మంది అణగారిన తరగతులకు చెందిన యువతీ, యువకులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు.

అనునిత్యం ప్రజల చెంతనే
ప్రస్తుతం గంధం చంద్రుడు అనంతపురము కలెక్టరుగా జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడానికి అపర్నిశలు కృషి చేస్తున్నారు. ఏడారిగా మారిపోతున్న అనంతపురము జిల్లాను ఆ దుస్థితి రాకుండా అడ్డుకోవాలని మొక్కలు పెంచి హరిత అనంతను నిర్మించాలనే సంకల్పంతో ఆయన కృషి చేస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ముందడుగేస్తున్నారు. చెన్నయ్- బెంగళూరు కారిడార్ ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాట పట్టించాలని వ్యూహారచన చేస్తున్నారు. ఒకప్పుడు రత్నాలను, వైడుర్యాలను రాశులుగా పోసి అమ్మిన నేలను తిరిగి అంతటి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చేందుకు కృసి చేస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులతో పాటు నిద్రించడం, ఆహార నాణ్యత తెలుసుకునేందుకు విద్యార్థులకు వండిన భోజనాన్ని విద్యార్థులతో కలిసి చేయడం, పొదుపు సంఘాల మహిళల సమావేశాలకు హాజరై వారి కష్ట సుఖాలను నేరుగా తెలుసుకోవడం, ఉపాధి కార్మికుల సమస్యలను సకాలంలో పరిష్కరించడం మొదలు ఇప్పడు కిసాన్ రైలు అనంతలో పరుగులు పెడుతోందంటే వీటన్నింటి వెనుకా గంధం చంద్రుడి పాత్ర ఎంతో కీలకమైనది. ఈ రైలు సాధనలో స్థానిక పార్లమెంటు సభ్యులు రంగయ్య కృషితో పాటు రైల్వేతో తనకున్న అనుబంధం రీత్యా గంధం చంద్రుడి ప్రత్యేక కృషి విశేషమైనది.

బెంగళూరు, చెన్నయ్ వంటి మహానగరాల నుంచి వలస కార్మికులు తిరిగివచ్చేసిన నేపథ్యంలో ఉపాధి పని దినాలు కల్పించడం జిల్లా కలెక్టరుగా ఆయనకు సవాలుగా మారింది. సవాళ్లను ఎదుర్కొవడం చిన్నప్పటి నుంచే అలవర్చుకున్న ఆయన ఈ కరోనా విపత్తు సమయంలోనూ వినూతన్న ఆలోచనలతో విధులను నిర్వహిస్తున్నారు. తోలు బొమ్మలకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరం కళాకారులకు ఆయన అండదండలను అందిస్తున్నారు. తోలుబొమ్మల మార్కెటింగ్ కు ప్రణాళికలు రచించారు. ఈత కొమ్మలు, ఆకులు, ఎర్ర పట్టల నుంచి తీసే నార వీటి నుంచి కూడా గంపలు, బొమ్మలు, ఇతర అల్లికల వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే విషయాలను ఆయన పరిశీలనలో ఉంది. ఇంతలా అంటే సమాజంలో వెనుకబడిన తరగుతులను, ప్రజలను, నిరుపేదలను అభివృద్ధి చేయాలన్న తపనలో ఆయనలో కనిపిస్తుంది.

కోవిడ్ కష్టకాలంలో ..
ప్రపంచాన్ని గడగడలాండిచిన కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడంలోనూ గంధం చంద్రుడు తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర ప్రభత్వంతోపాటు, జాతీయస్థాయిలోనూ ప్రశంసలు పొందారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినవారిని రోగులు గా భావించవద్దని, వారిని పాజిటివ్ వ్యక్తులుగా గుర్తించి సానుకూల, ఆశావహ దృక్పథాన్ని పెంపొందింపజేయాలని అధికారులను ఆదేశించారు. కరోనాను ఎదుర్కోవడంలో మానసిక ధైర్యమే కీలకమన్న విషయాన్ని వైద్య నిపుణులు కూడా ప్రకటించారు. గంధం ఆలోచనలు అలా ప్రత్యేకమైనవి. కోవిడ్ మాట వినగానే ఆమడ దూరం పరిగెత్తిన తొలి నాళ్లలోనే చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల చెంతకు నేరుగా వెళ్లి వారికి మానసిక స్థైర్యాన్ని నూరిపోసిన ఫ్రంట్ లైన్ వారియర్ గంధం చంద్రుడు. మాస్కుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడితే వెంటనే అనంతపురము జిల్లా ముందుకొచ్చింది. స్వయం సహాయక బృందాల ద్వారా మాస్కులను సిద్ధం చేస్తామంటూ గంధం చంద్రుడు ప్రతిపాదించారు. రాష్ట్రంలోనే మాస్కులు తొలిసారి అనంతలోనే తయారవ్వడం విశేషం. కరువు జిల్లా అనంతకు గంధం లాంటి అధికారి నిజం గా గొప్పవరం.
ఈ సామాజిక చైతన్య సు’గంధం’ ఇక మందూ ఇదే చైతన్య స్పూర్తితో మరింతగా పరిమళించాలని ఆకాంక్షిద్దాం.