పిల్ అంటే జోక్ కాదు

అమరావతి : గాలి కబుర్లు ఆధారంగా చేసుకుని పిల్ వేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రోడ్లపై మాట్లాడుకునే కబుర్లు ఆధారంగా చేసుకుని పిల్ వేయడం ఇటీవలకాలంలో పరిపాటి అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అన్నారు.
పిల్ అంటే ప్రజాహితం ఉండాలని, జోక్‌గా మార్చేయకూడదని అన్నారు. దేవాదాయ నిధులను అమ్మ ఒడి పథకానికి మళ్లిస్తున్నారని విజయవాడకు చెందిన లాయర్ చింతా ఉమామహేశ్వర్‌రెడ్డి పిల్ వేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
దేవాదాయశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్ భాగమని, దీనికి కేటాయించిన నిధులను అమ్మ ఒడి పథకాన్ని మళ్లించారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా పిల్ వేయడాన్ని ఏజీ తప్పుపట్టారు. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయశాఖలో భాగం కానేకాదని, ఆ శాఖ కమిషనర్ కార్పొరేషన్ పాలనా వ్యవహారాలను చూస్తారని చెప్పారు. పిల్లో చూపిన జీవోలో నిధుల మళ్లింపు ప్రస్తావనే లేదన్నారు. పిల్లో పేర్కొన్నపత్రాల్లో ఆధారాలు లేనందున చీఫ్ జస్టిస్ జి.కె. మహేశ్వరి, జస్టిస్ కె. లలితతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాజ్యాన్ని కొట్టేయడానికి సిద్ధపడింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని పిల్ తరఫు లాయర్ రవిప్రసాద్ కోరారు. ఆధారాలు చూపనప్పుడు ప్రభుత్వానికి ఆదేశాలివ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. విచారణను వాయిదా వేస్తే ఆధారాలు చూపుతామని లాయర్ చెప్పడంతో విచారణ వచ్చే నెల 11కి వాయిదా పడింది.