మాస్కే కవచం

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ( నాని ) కోవిడ్-19 నివారణ కోసం సరైన సమయంలో, సరైన పద్దతిలో సరైన మాస్క్ వినియోగం పై విస్తృత ప్రచార కార్యక్రమం “మాస్కే కవచం” ను గురువారం ప్రారంభించారు.
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్
ఎపిఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ విజయరామరాజు ,
ఆరోగ్య శాఖ సలహాదారు కమల్ రాజ్ , అడిషనల్ డైరెక్టర్ వాసుదేవరావు ,యునిసెఫ్ కన్సల్టెంట్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘మాస్కే కవచం ‘ పేరిట నెల పాటు విస్తృత ప్రచారం
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని ) మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
లాక్డౌన్ ను క్రమంగా ఎత్తివేయడంతో వ్యాపారాలు, ప్రజా రవాణా, కార్యాలయాలు మళ్లీ పనిచేస్తున్న ఈ కీలకం తరుణంలో కోవిడ్-19 ను సమర్ధంగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ప్రవర్తనలు, అలవాట్లలో భాగంగా భౌతిక దూరం, చేతుల పరిశుభ్రతతో పాటు శ్వాసకోశ పరిశుభ్రత అత్యంత అవసరం. ఈ దిశలో రూపుదిద్దుకున్న విస్తృత ప్రచార కార్యక్రమమే “మాస్కే కవచం”. సరైన సమయంలో, సరైన పద్దతిలో సరైన మాస్క్ వినియోగించడం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో కరోనా వ్యాప్తిని అదుపులో పెట్టడం ఈ ప్రచార కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ప్రపంచ వ్యాప్తంగా అనేక నివేదికలు కోవిడ్-19 నివారణకు మాస్క్ పట్ల అవగాహన, వాటి వినియోగం చాలా ముఖ్యమని పేర్కొన్నాయి. కానీ, వాటిని వినియోగించడంలో పాటించవలసిన జాగ్రత్తల విషయంలో చాలా చోట్ల అవగాహన లోపించింది. అందువల్ల, ఈ విషయాల మీద అందరికీ అవగాహన కల్పించడంతో పాటు పట్టణాలలోని మురికివాడలు, కాలనీలు, గ్రామీణ ప్రాంతాలు, ఉద్యోగస్తులు, అత్యవసర సేవలు అందిస్తున్నవారు, యువత పైనా ప్రత్యేక దృష్టి పెట్టామని నాని చెప్పారు.
నెల రోజుల పాటు కొనసాగే ఈ విస్తృత ప్రచారంలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో జిల్లా కలెక్టర్ల నాయకత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు, మత నాయకులు పాల్గొని మాస్క్ వినియోగం పై అవగాహన కల్పిస్తారు.
• పరస్పర సంభాషణ :
గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహకార బృందాలు, ఇతర వాలంటీర్లు, ఇళ్లకు వెళ్లి కరపత్రాలు, చేతి పుస్తకం, వీడియోలు ఉపయోగించి, ఆ ఇంటి కుటుంబ సభ్యుల తో మాట్లాడి, మాస్క్ వినియోగం పై అవగాహన కల్పిస్తారు, మాస్క్ ఎలా వేసుకోవాలో వేసుకొని చూపిస్తారు.
• పోస్టర్ల ప్రదర్శన :
గ్రామ పంచాయతీలు, గ్రామ/వార్డు సెక్రటేరియట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపులు, మార్కెట్లు, ఎటిఎం లు, బ్యాంకులు, పోస్టాఫీసులు, అపార్టుమెంట్ కాంప్లెక్సులు, ఆఫీసులు, ఇతర జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాలలో పోస్టర్లను ప్రదర్శిస్తారు
• హోర్డింగ్ ల ప్రదర్శన :
జిల్లా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో పట్టణ కూడళ్ళు, ఇతర జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాలలో హోర్డింగ్ లను పెడతారు
• మైకింగ్ :
ఎంపిక చేసిన పట్టణ మురికివాడలలో, గ్రామీణ ప్రాంతాలలో ఆటో/వ్యాన్ ద్వారా మైకుల ద్వారా ప్రచారం చేస్తారు
• రేడియో :
ఆకాశవాణి, ఎఫ్.ఎం. రేడియో చానళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్లు, నిపుణులతో చర్చాగోష్టి, ఫోన్-ఇన్ కార్యక్రమాలుంటాయి
దూరదర్శన్ మరియు ఇతర ప్రైవేటు చానళ్ళలో అడ్వర్టైజ్మెంట్లు, నిపుణులతో చర్చాగోష్టి, ఫోన్-ఇన్ కార్యక్రమాలుంటాయి
• సోషల్ మీడియా :
యూ-ట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా లో #MaaskeKavacham వీడియోలు, డిజిటల్ కార్డులు, ఇన్ఫోగ్రాఫిక్ లతో విస్తృత ప్రచారం చేస్తారు
• డిజిటల్ మీడియా :
ఐ.వి.ఆర్.ఎస్. మరియు మొబైల్ ఆడియో సందేశాల ద్వారా ప్రచారం చేస్తారు.