Connect with us

న్యాయం

రాజధానులపై 21 వరకు స్టేటస్ కో

Published

on

Spread the love

అమరావతి : పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వుల అమలును సెప్టెంబరు 21 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం సెప్టెంబర్‌ 11 నాటిలోగా కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని, ఆ తర్వాత పిటిషనర్లు తమ అభ్యంతరాలతో అఫిడవిట్లను సెప్టెంబరు 17లోగా దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 
* రాజధాని అంశాలకు సంబంధించి  రైతులు,వివిధ సంఘాలు, ప్రజాప్రతినిధులు సుమారు 75 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని గురువారం మరోసారి విచారణ జరిపిన సందర్భంగా రైతు ఇ. రాంబాబు ఇతరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా వాదిస్తూ,  యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖాతరు చేయకుండా విశాఖలో గెస్ట్‌ హౌస్‌ కట్టేందుకు శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఏకంగా 30 ఎకరాల్లో గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్రపతి భవన్‌ 5 ఎకరాలలోపే ఉంటుందని, 30 ఎకరాల్లో గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం అంటే అది రాజధానిని విశాఖకు తరలింపులో భాగంగా చేస్తున్నదే అవుతుందని చెప్పారు. గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిలో నిర్మిస్తోందన్నారు.  హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసినప్పుటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా విశాఖలోని కాపులుప్పాడలో భారీ అతిథి గృహాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టిందని గుప్తా చెప్పారు. స్టేటస్‌కో ఉన్నప్పుడు గెస్ట్‌ హౌస్‌కు శంకుస్థాపన ఏంటని, ఇలా చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. అమరావతి నుంచి విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలులో భాగమేనని అన్నారు. 

వీవీఐపీల కోసమే గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ వాదిస్తూ, అత్యంత ప్రముఖుల కోసం (వీవీఐపీల) కోసం గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో అన్ని వసతులు ఉన్న గెస్ట్‌ హౌస్‌ లేదని, ఉన్న గెస్ట్‌ హౌస్‌ల్లో తగిన వసతులు లేవని, వినియోగానికి యోగ్యంగా కూడా లేవని, అయినా కోర్టు ధిక్కార పిటిషన్‌ కాపీ బుధవారం రాత్రి అందిందని,  పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలించేందుకు సమయం ఇవ్వలేదని ఏజీ చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. స్టేటస్‌కో ఆర్డర్‌ ఉండగా విశాఖలో గెస్ట్‌ హౌస్‌ ఎందుకు నిర్మాణం చేస్తున్నారో వివరాలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

రిట్లపై విచారణ

ఇప్పటికే దాఖలైన రిట్లలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లల్లోని వాదనలనే అన్ని రిట్లకు వర్తింపు ఉంటుందని ప్రభుత్వం మెమో దాఖలు చేయాలని, కౌంటర్‌లోని అంశాలే కాకుండా ఇంకేమైనా వివరాలు ఉంటే విడిగా అడిషినల్‌ అఫిడవిట్‌ వేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్తగా రిట్లు దాఖలైతే వాటిలో కూడా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు వేయవచ్చునని స్పష్టం చేసింది. తొలుత దీనిపై కొద్దిసేపు తర్జనభర్జన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ రాకేశ్‌ ద్వివేదీ కల్పించుకుని ఇప్పటికే వేసిన కౌంటర్లను అన్ని రిట్లకు వర్తింపజేయవచ్చునని చెప్పారు. రాష్ట్రం తరఫున మరో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నపాడే స్పందిస్తూ, రోజుకో రిట్‌ చొప్పున వేస్తూ ఒక పథకం ప్రకారం కోర్టుల్లో కేసుల విచారణ జాప్యమయ్యేలా చేస్తున్నారని చెప్పారు. దీనిపై హైకోర్టు.. రిట్లు వేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, దీనిని ఎవ్వరూ అడ్డకోలేరని, అయితే ఇప్పటికే దాఖలైన రిట్లపైనే విచారణ పూర్తి చేసి తగిన ఉత్తర్వులు ఇస్తామని వివరించింది. తిరిగి తాము ఆదేశాలిచ్చే వరకూ గతంలోని స్టేటస్‌కో ఆర్డర్‌ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. 

వైఎస్‌ జగన్‌ ఇతరులకు నోటీసులు

ఈ దశలో పిటిషనర్‌ లాయర్‌ వాసిరెడ్డి ప్రభునాథ్‌ జోక్యం చేసుకుని, వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్నవారికి నోటీసులు ఇవ్వాలని కోరారు. దీంతో  వ్యక్తిగత హోదాల్లో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్థిక, మున్సిపల్‌ మంత్రులు రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎక్స్‌పర్ట్‌ కమిటీ చైర్మన్‌లకు నోటీసులు ఇచ్చింది. వీరంతా కావాలంటే మూడు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.  వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఎం, జనసేన పార్టీలకు సైతం నోటీసులు జారీ చేసిన హైకోర్టు ఈ పార్టీలు కూడా కావాలంటే కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయవచ్చునని పేర్కొంది.  

21 నుంచి రోజూ విచారణ 


ఇదిలా ఉండగా, రాజధాని అంశాలపై దాఖలైన పలు వ్యాజ్యాలను వచ్చే నెల 21 నుంచి రోజు వారీ ప్రత్యక్ష విచారణ చేసే అంశంపై న్యాయవాదులతో హైకోర్టు చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే ప్రత్యక్ష విచారణ జరిపై అంశంపై కూడా చర్చించింది. ఇందుకు న్యాయవాదులు కూడా అంగీకారం తెలిపారు. 21న విచారణను భౌతికంగా లేదా వర్చువల్‌ లేదా హైబ్రీడ్‌. ఏవిధానంలో చేయాలనే విషయంలో ఇప్పుడేమీ ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ నాటికి ప్రత్యక్షంగా విచారణ చే యాలో లేక ఇతర విధానాల్లోనే ఏవిధంగా చేయాలో తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. దీనిపై తాము త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 21వ తేదీ సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ విచారణ జరుపుతామని వెల్లడించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసింది.   

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *