యువతరానికి దిక్సూచి వినోబా భావే

- యువతలోని సామర్థ్యం నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి!
- వినోబా భావే వంటి గొప్పవారి జీవితాల్నినేటి తరం యూత్‌కి తెలపాలి
- ఆచార్య వినోబాభావే 125వ జయంత్యుత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
న్యూఢిల్లీ : భారతదేశాన్నిస్వావలంబన దేశంగా తీర్చిదిద్దేందుకు యువతలోని సామర్థ్యాన్ని ప్రోత్సహించి సరైన శిక్షణను అందించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రతి భారతీయుడిలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని తట్టిలేపి స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్వయం సమృద్ధి సాధించ వచ్చని అన్నారు. అంతేగాక, సమాజానికి దీర్ఘకాలంలో మేలు జరిగేందుకు చొరవతీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ప్రముఖ భూదానోద్యమ నేత ఆచార్య వినోబాభావే 125వ జయంతిని పురస్కరించుకుని హరిజన్ సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాల వెబినార్ వేదికగా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం ద్వారా సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు ప్రయత్నించిన కృషీవలుడు ఆచార్య వినోబా భావే అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలకు పునర్వైభవం తీసుకురావడం ద్వారా వారు స్వప్నించిన గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ప్రతి భారతీయుడిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించడంతోపాటు సమాజంలో మార్పుకోసం మహాత్మాగాంధీ నిరంతరం ప్రయోగాలు చేశారని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. అస్పృశ్యత వంటి అతిపెద్ద సామాజిక రుగ్మతను నిర్మూలించేందుకు సర్వధర్మసమభావనతో అందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో... దీనజనోద్ధరణకు సత్యనిష్ఠ, అంకితభావంతో గాంధీ చేసిన కృషి అద్వితీయమన్నారు. అందుకే మహాత్ముడు... నాటికి, నేటికి, ఎప్పటికీ భారతదేశపు వెలుగు దివిటీ అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు.
సశక్త, స్వాభిమాన, ఆత్మనిర్భర భారత నిర్మాణం జరగాలని సూచించిన ఉపరాష్ట్రపతి, భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న ఆత్మనిర్భర భారత నినాదం కేవలం జాతీయవాదమో, ఆత్మరక్షణవాదమో కాదని… విశ్వ సంక్షేమంలో మన దేశాన్ని కీలకమైన భాగస్వామిగా రూపుదిద్దటమే ఈ నినాదం వెనకున్నఅసలు ఉద్దేశమని స్పష్టం చేశారు. సమాజంలోని పీడిత, తాడిత, వంచిత వర్గాల అభ్యున్నతితోపాటు వారికి సరైన గౌరవ దక్కాలన్న ఉద్దేశంతో పూనా ఒప్పందానికి అనుగుణంగా మహాత్మాగాంధీ 1932లో హరిజన్ సేవక్ సంఘ్‌ను ఏర్పాటుచేశారని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, విదేశీ పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతీయులంతా ఐకమత్యంతో పోరాడాలని, మన భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నదే మహాత్ముని అభిమతమని తెలిపారు. అలాంటి మహాత్మాగాంధీకి ఆదర్శవంతమైన శిష్యుడిగా ఆచార్య వినోబాభావే చేసిన కృషిని శ్లాఘించిన ఉపరాష్ట్రపతి, భారతీయతతోపాటు సేవ, త్యాగాలను వినోబా భావే పుణికిపుచ్చుకున్నారన్నారు.
ఎవరినీ బలవంత పెట్టకుండా, హింసకు తావులేకుండా సానుకూలతతో ప్రజల భాగస్వామ్యంతో వినోబా భావే చేపట్టిన భూదానోద్యమం ద్వారా వచ్చిన మార్పును నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 14 ఏండ్ల పాటు దాదాపు 70 వేల కిలోమీటర్లు కాలినడకన తిరిగి 42 లక్షల ఎకరాల భూమిని సేకరించి రైతులకు పంచిన వారి ఉద్యమస్ఫూర్తిని యువత ప్రేరణగా తీసుకోవాలన్నారు. వినోబా భావే ఇచ్చిన పిలుపుతో తెలంగాణలోని పోచంపల్లిలో వెదిరె రామచంద్రారెడ్డి స్వచ్ఛందంగా ఇచ్చిన 100 ఎకరాల భూమిని దానం చేయడంతో ఈ ఉద్యమం మొదలైన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
వినోబాభావే సర్వోదయ ఉద్యమం, గ్రామదాన్ అంశాలు... మహాత్ముడు కలలుగన్న గ్రామాల పునర్నిర్మాణం, గ్రామరాజ్యం ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్లాయన్నారు. ధనికులు స్వచ్ఛందంగా తమ భూములను పేదలు, రైతుల కోసం దానం చేయడం సమాజంలోని సామాజిక-ఆర్థిక అంతరాలను చెరిపేసే ఓ సహకార వ్యవస్థ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశ జనాభాలో 60 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారన్న ఉపరాష్ట్రపతి... వారి అభ్యున్నతికి సమగ్ర కృషి జరగడమే ఆచార్య వినోబాభావే 125వ జయంతి సందర్భంగా వారికి ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. ఇలాంటి మహనీయుల గురించి యువత తెలుసుకుని వారి బాటలో అనుసరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
కుల, మత, లింగ, పేద, ధనిక వివక్షల్లేకుండా అందరికీ సమాన అవకాశాలు దక్కాలని… ఎలాంటి తారతమ్యాలు చూపకుండా మనుషులను మనుషుల్లాగే గౌరవించాలన్నారు. సామాజిక, ఆర్థిక ఏకత్వానికి సర్వోదయ, అంత్యోదయ సిద్ధాంతాల అమలు అత్యంత అవసరమన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి గాంధేయ విధానంలో సహకారం చేయాల్సిన బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కరోనా సందర్భంగా చేసిన నిష్పాక్షిక సేవను గౌరవించాలని, కరోనా పోరాటంలో ముందు వరసలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టుల సేవలు మరువలేనివన్నారు. వీరితోపాటు దేశంలో ఆహార భద్రతకు భరోసా కల్పిస్తూ… ఆహారోత్పత్తికి స్వేదం చిందిస్తున్న అన్నదాతల అలుపెరగని శ్రమను గుర్తుచేసుకోవాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడు డాక్టర్ శంకర్ కుమార్ సన్యాల్, కార్యదర్శి డాక్టర్ రజనీశ్ కుమార్‌తోపాటు పలువురు గాంధేయవాదులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.